చిట్ ఫండ్ ఫ్రాడ్ కేసులో ఇద్దరు అరెస్ట్

చిట్ ఫండ్ ఫ్రాడ్ కేసులో ఇద్దరు అరెస్ట్
  • చిట్ ఫండ్ ఫ్రాడ్ కేసులో ఇద్దరు అరెస్ట్
  • రూ.5 కోట్ల వరకు మోసం జరిగినట్లు గుర్తించినమాదాపూర్ పోలీసులు

 గచ్చిబౌలి, వెలుగు: సమతామూర్తి చిట్ ఫండ్ పేరుతో జనాల నుంచి డబ్బులు కట్టించుకొని బోర్డు తిప్పేసిన కంపెనీ నిర్వాహకులు ఇద్దరిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం120 మంది బాధితులు వెలుగులోకి వచ్చారని, నిందితులు దాదాపు రూ.5 కోట్ల వరకు బాధితుల నుంచి చిట్టీల పేరుతో వసూలు చేసినట్లు గుర్తించామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. బుధవారం మాదాపూర్ డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన  వివరాలు వెల్లడించారు.

మంచిర్యాల జిల్లాకు చెందిన ఏల్పుల శ్రీనివాస్(47), అతడికి కొడుకు వరుసయ్యే రాకేశ్ వర్మ(27), ఎల్ బీనగర్ కు చెందిన గణేశ్ మాదాపూర్ లో 6 నెలల కిందట సమతామూర్తి చిట్ ఫండ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీకి ఎలాంటి అధికారిక గుర్తింపు లేకపోగా.. మాదాపూర్ తో పాటు ఎల్ బీనగర్, కూకట్ పల్లిలో బ్రాంచ్ లు తెరిచారు. ఆన్ లైన్ ద్వారా ప్రచారం చేశారు. కొందరిని టెలీకాలర్స్ గా రిక్రూట్ చేసుకొని వారితో జనాలకు కాల్స్ చేయించి చిట్ ఫండ్ ఇన్ స్టాల్ మెంట్స్ కట్టేలా చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు మహిళలు, సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ సైతం వీరి ట్రాప్ లో పడి చిట్టీలు కట్టారు. ఒక్కొక్కరు నెలకు రూ.3 వేల నుంచి రూ.50 వేల వరకు చిట్టీ డబ్బులు కట్టారు. చిట్టీలు లిఫ్ట్ చేసుకున్న వారికి నిర్వాహకులు చెక్కులను ఇచ్చారు. అయితే, ఆ అకౌంట్లలో డబ్బులు లేకపోవడంతో చెక్కులు బౌన్స్ అయ్యాయి. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు గత నెల 13న మాదాపూర్ పీఎస్ లో కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రెండ్రోజుల కిందట బాధితులు సైబరాబాద్ సీపీ అవినాష్​మహంతిని కలిశారు.

కమిషనర్ ఆదేశాలతో చిట్ ఫండ్ నిర్వాహకులు శ్రీనివాస్, రాకేశ్ వర్మను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సమతామూర్తి చిట్ ఫండ్ బాధితులు ఇప్పటివరకు 120 మంది వెలుగులోకి వచ్చారని.. సుమారు రూ.5 కోట్ల వరకు మోసం జరిగినట్లు గుర్తించామని డీసీపీ వినీత్ తెలిపారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మరో నిర్వాహకుడు గణేశ్ పరారీలో ఉన్నాడన్నారు. రిజిస్ట్రేషన్ లేని చిట్ ఫండ్ సంస్థలను నమ్మి మోసపోవద్దని డీసీపీ సూచించారు. మీడియా సమావేశంలో అడిషనల్ డీసీపీ నంద్యాల నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.